రూ.3,643 కోట్లతో శివాజీ విగ్రహ నిర్మాణం.!

SMTV Desk 2018-12-24 13:40:49  Shivaji statue, Chhatrapati Shivaji Maharaj, Arabian Sea

ముంబయి, డిసెంబర్ 24: అరేబియా మహాసముద్రం తీరాన నిర్మితమవుతున్న మరాఠీ మహారాజు ఛత్రపతి శివాజీ విగ్రహ(శివ్ స్మారక్) నిర్మాణాన్ని 2022-23 సంవత్సరంలోపు పూర్తిచేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విగ్రహ ఏర్పాటుకై ప్రభుత్వం రూ.3,643.78 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు పేర్కొంది. కాగా, గత నెల 1న కెబినెట్‌ సమావేశంలో విగ్రహ ఏర్పాటుకు రూ.3700.84 కోట్లు కేటాయించింది. అయితే అధికారికంగా మాత్రం అందులో రూ. 56.70కోట్లు తగ్గించి రూ.3643.78కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. విగ్రహ నిర్మాణం ఖర్చులకు సంబంధించిన జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.

మొత్తం బడ్జెట్‌లో విగ్రహ నిర్మాణానికి రూ.2,581 కోట్లు కేటాయించారు. జీఎస్టీ, భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాల స్థాపనకు రూ.309.72 కోట్లు, నీటి వనరులు, విద్యుత్‌ సరఫరా కోసం మరో రూ.45 కోట్లు వెచ్చించనున్నారు. భవిష్యత్‌ అవసరాల కోసం రూ.112 కోట్లు, విగ్రహ పరిసరాల్లో కంప్యూటరీకరణ కోసం రూ.56కోట్లు, ఇతరత్రాల కోసం రూ. 140 కోట్లు కేటాయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి విగ్రహ నిర్మాణ పనులు నిరంతరంగా కొనసాగుతాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందుకు గానూ రూ.8కోట్లు ఖర్చు చేశారు.