శబరిమలలో రాళ్లదాడి..!

SMTV Desk 2018-12-24 12:19:32  Shabarimala Temple, High Tensions, Pamba River, Stones Attacks

కేరళ, డిసెంబర్ 24: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మరల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ బృందంలోని రుతుస్రావ వయసు ఉన్న 11 మంది మహిళలను ఆందోళనకారులు ఆదివారం తరిమికొట్టారు. తమిళనాడుకు చెందిన ఈ మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు తెల్లవారుజామున తమిళనాడు–కేరళ సరిహద్దు ద్వారా పంబకు వచ్చారు. చాలామంది ఆందోళనకారులు మార్గమధ్యంలో వీరి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.

అనంతరం వందలాది మంది భక్తులు, ఆందోళనకారులు ఆలయానికి వెళ్లేదారిలో వీరిని నిలువరించారు. ఈ సందర్భంగా స్వామి దర్శనానికి వెళితే ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశముందని పోలీసులు నచ్చజెప్పగా, అయ్యప్పను దర్శించుకున్నాకే వెనక్కి వెళతామని వారు స్పష్టం చేశారు. పోలీసులు వారిని కొండపైకి తీసుకెళ్లేందుకు యత్నించగా, వందలాది మంది భక్తులు వెంటపడి రాళ్లతో తరిమికొట్టారు. అప్రమత్తమైన అధికారులు మహిళా భక్తులను సమీపంలోని భద్రతాసిబ్బంది ఉండే గదిలోకి తీసుకెళ్లారు. పరిస్థితి చేయిదాటడంతో వీరంతా అయ్యప్పను దర్శించుకోకుండానే వెనక్కు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో ఈ 11 మంది మహిళల్ని గట్టి భద్రత నడుమ సరిహద్దు దాటించారు.

అయ్యప్ప దర్శనానికి మహిళల్ని పోలీసులు తీసుకెళ్లేందుకు యత్నించడాన్ని బీజేపీ నేత కె.సురేంద్రన్‌ తప్పుపట్టారు. వీరి వెనుక ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, హిందుత్వ సంస్థల కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు.