హనుమంతుడిది ఏ కులం, ఏ మతం ?

SMTV Desk 2018-12-21 12:43:41  Lord Hanuman, Which Caste, CM Yogi Adityanadh, UP Leaders

లక్నో, డిసెంబర్ 21: హిందువు మతస్తులు ఎంతో భక్తితో కొలుచుకునే హనుమంతుడిది ఏ కులం, ఏ మతం అనే చర్చ దేశంలో పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ చర్చకు తొలుత ఆజ్యం పోసింది ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. హనుమంతుడు దళిత వర్గానికి చెందినవాడని ఆమధ్య ఆదిత్యనాథ్ అన్నారు. ఆ తర్వాత హనుమంతుడు ముస్లిం అంటూ మరో వాదన తెరపైకి వచ్చింది. హనుమాన్ ‘ముస్లిం అని తాను బలంగా నమ్ముతానని బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఈ జాబితాలో యూపీకి చెందిన మరో మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి చేరారు. హనుమంతుడు దళితుడు కాదు, ముస్లిం కాదని... ఆయన జాట్ కులానికి చెందినవాడని చౌదరి అన్నారు. ఎవరైనా సమస్యల్లో ఉంటే వారికి సాయం చేసేందుకు జాట్లు ముందుకు కదులుతారని.. అవతల ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆలోచించరని అన్నారు. ఇదే విధంగా సీతాదేవిని కాపాడేందుకు హనుమంతుడు వెళ్లాడని... జాట్లకు ఉన్న స్వభావమే ఆయనకు ఉందని... అందుకే ఆయనను జాట్ కులస్తుడిగా తాను భావిస్తున్నానని తెలిపారు. ఇంతకీ హనుమంతుడిది ఏ కులం, ఏ మతం అనే చర్చ దేశంలో పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కడికి దారితీస్తాయో వేచిచూడాలి.