జీఎస్‌ఎల్వీ-ఎఫ్11 రాకెట్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్

SMTV Desk 2018-12-19 14:42:34  Srihari kota, GSAT-7A, GSLV-F1 Rocket

చెన్నై, డిసెంబర్ 19: ఈ రోజు సాయంత్రం 4.10 గంటలకు శ్రీహరికోట నుంచి దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7ఏను జీఎస్‌ఎల్వీ-ఎఫ్11 రాకెట్ ద్వార నింగిలోకి పంపనున్నారు. ఇందుకు 26గంటల కౌంట్‌డౌన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం ప్రారంభించారు. సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్) లోని రెండో ప్రయోగవేదిక వద్ద రాకెట్ పైభాగాన 2.2టన్నుల జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. క్రయోజెనిక్ ఇంజిన్ కలిగిన నాల్గవతరం అంతరిక్ష వాహక నౌక జీఎస్‌ఎల్వీ-ఎఫ్11.. మూడంచెలలో జీశాట్-7ఏను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. జీశాట్-7ఏ ను సైనిక సమాచార ఉపగ్రహంగా పరిగణిస్తున్నారు. ఇది భారత వాయుసేనకు70%, సైన్యానికి 30% ఉపకరించనున్నది. వైమానిక దళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలను తేనున్నది. ఎనిమిదేండ్ల పాటు సేవలందించనున్న ఈ ఉపగ్రహం కేయూ బ్యాండ్ ద్వారా రాడార్లకన్నా శక్తిమంతమైన సిగ్నల్స్‌ను అందిస్తుంది. ఈ సిగ్నల్స్ విమానాలకు ప్రధానంగా ఉపకరిస్తాయి. గగనతలంలో విహరిస్తున్న రెండు విమానాల మధ్య పరస్పర సమాచార మార్పిడిని సులభతరం చేస్తుంది అని ఇస్రో అధికారులు తెలిపారు.

శ్రీహరికోట నుంచి గత నెల 14న జీశాట్-29, 29న హైసిస్ ఉపగ్రహాలను, ఈ నెల 5న ఫ్రెంచ్ గయానా నుంచి జీశాట్-11ఏను ఇస్రో విజయవంతంగా పంపింది. తక్కువ వ్యవధిలో ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగిస్తుండటం విశేషం.