ముంబై, నవంబర్ 5: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ హీరో,హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కేదార్నాథ్’. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. అయితే ఈ చిత్రం 2013లో కేదార్‌నాథ్‌లో వచ్చిన వరదల నేపథ్యంలో ఓ యువతి, యువకుడి మధ్య పుట్టిన ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిసిందే. కాగా ఈ చిత్ర ట్రైలర్ చూస్తే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటూ కేదర్నాథ్ ఆలయ అర్చకులు మండిపడ్డారు. అయితే ఈ సినిమాను నిషేధించాలంటూ ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయ అర్చకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
‘సినిమాను నిషేధించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. సినిమా టీజర్ చూసినవారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా లవ్ జిహాద్‌ని ప్రేరేపించేలా ఉందని, తమ మనోభావాలు దెబ్బతినేలా టీజర్ ఉందని అంటున్నారు. పోస్టర్లో ముస్లిం యువకుడు, హిందూ యువతిని మోసుకెళుతున్నట్లు చూపించారు. అసలు కేదార్‌నాథ్‌కు ముస్లింలే రారు. అదీకాకుండా సినిమా టీజర్లో..వరదల్లో వేలాది మంది కొట్టుకుపోతూ చనిపోతుంటే ఆ దృశ్యాల మధ్య ముద్దు సన్నివేశాలను చూపించారు. కాబట్టి ‘కేదార్నాథ్’ సినిమాను బ్యాన్ చేయండి.’ అని ఆలయ అర్చకులకు చెందిన కేదార్ సభ ఛైర్మన్ వినోద్ శుక్ల మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయమై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. కాగా ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.