నేడే రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు...

SMTV Desk 2017-07-20 11:08:17  President, parlament, counting, delhi

న్యూఢిల్లీ, జూలై 20 : సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పార్లమెంటులో గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. రాష్ట్రపతి భవన్‌లో కొలువుదీరే తదుపరి ప్రథమ పౌరుడు ఎవరనేది సాయంత్రం 5 గంటలకు తెలియనుంది. ఓట్ల లెక్కింపు కోసం లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయం విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పకడ్బందీ భద్రత నడుమ ఢిల్లీకి తరలించారు. ఓట్ల లెక్కింపు కోసం నాలుగు టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం ఎనిమిది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ప్రతి రౌండ్‌లో లెక్కింపు ముగిసిన వెంటనే ఫలితాలను వెల్లడించనున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ కూటమి తరఫున బీహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ కూటమి తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పోటీ పడ్డారు. ఈ నెల 18న పార్లమెంటుతో సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, లోక్‌సభ, రాజ్యసభల ఎంపీలు 776 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 99.14శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలుపొందిన అభ్యర్థికి లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా నియామక పత్రాన్ని అందజేస్తారు.