సోనియాగాంధీని స్వయంగా పలుకరించిన మోదీ

SMTV Desk 2017-07-17 16:39:09  modhee, parlament, delhi,

న్యూఢిల్లీ, జూలై 17 : పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు లోక్‌సభలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సభా కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందే లోక్‌సభలో అడుగుపెట్టి, వివిధ విపక్ష పార్టీ నేతలను పలుకరించారు. మొదటి వరుసలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ టి.తంబిదురైలను పలకరించి రెండో వరుసలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియాను సైతం ప్రధాని పలుకరించారు. మోదీ సభలోకి అడుగుపెట్టగానే ముకుళిత హస్తాలతో సభ్యులందరికీ నమస్కరించారు. ఈ సందర్భంగా లోక్ జనశక్తి పార్టీ సభ్యుడు రామచంద్ర పాశ్వాన్ మోదీకి పాదాభివందనం చేశారు. పార్లమెంటు సజావుగా సాగేలా ప్రతిపక్షాలన్నీ సహకరించాలని సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతూ మోదీ కోరారు.