కొత్త రూ.100 నోటును విడుదల చేసిన ఆర్బీఐ..

SMTV Desk 2018-07-19 16:34:38  new 100 rupees note, rbi 100 rupees note, ran ki vav, mumbai

ముంబై, జూలై 19 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త రూ.100 నోటును గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ సిరీస్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ నోటు వెనుక భాగంలో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ‘రాణి కీ వావ్’ ను ముద్రించారు. ఈ నోటు 66 mm × 142 mm. వీలైనంత త్వరలోనే ఈ కొత్త వంద నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ వెల్లడించింది. దీనిపై స్వచ్ఛభారత్‌ లోగో, ఏ సంవత్సరంలో ముద్రించారు తదితర వివరాలు ఉంటాయి.పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత చిల్లర కష్టాలను తీర్చేందుకు ఆర్‌బీఐ కొత్తగా రూ.200, రూ.10, రూ.50 నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నోటు ముందు భాగంలో 100 అంకె ఉంటుంది. దేవనాగరి లిపిలోనూ ఇది ఉంటుంది. మిగతా నోట్ల తరహాలోనే మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. ఇంగ్లిష్‌లో ఆర్‌బీఐ, ఇండియా హిందీలో భారత్, 100 అనే అక్షరాలను పొందుపరిచారు. గాంధీ ఫొటోకు కుడివైపు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉండగా.. కుడివైపు అశోకుడి నాలుగు సింహాలు.. గాంధీ, 100 సంఖ్యల వాటర్ మార్క్ ఉన్నాయి.