ఆస్పత్రిలో చేరిన కరుణానిధి..

SMTV Desk 2018-07-18 12:12:45  dmk leader M. Karunanidhi, Kauvery Hospital, chennai

చెన్నై, జూలై 18 : డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి బుధవారం ఆస్పత్రిలో చేరారు. సాధారణ చెకప్‌ కోసం ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. శ్వాస నాళాల (ట్రాకియోటమీ) సంబంధిత చికిత్స కోసం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కరుణానిధి గతకొంతకాలంగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చికిత్స ప్రక్రియలో భాగంగా ప్రతి ఆరు నెలలకోసారి ట్రాకియోటమీ ట్యూబ్స్‌ (శ్యాస నాళాలు) మార్చాల్సి ఉంటుందని, ఈ చికిత్స కోసమే ఆయన ఆస్పత్రిలో చేరారని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. 95 ఏళ్ల కరుణానిధి గత ఏడాది గొంతు ఇన్‌ఫెక్షన్, ఊపిరితిత్తులు సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయనకు శ్వాస ఇబ్బందుల నుంచి ఉపశమనానికి విండ్‌పైప్ అమర్చి చికిత్స అందించారు. తాజాగా మరోసారి కరుణానిధి ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. డీఎంకే ప్రముఖులు, నాయకులు పార్టీ కార్యాలయం అన్నా అరివాలయం, గోపాలపురంలోని ఆయన నివాసగృహం, కావేరి ఆస్పత్రి వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడారు. కేవలం చిన్నపాటి ఆపరేషన్ గురించి మాత్రమే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు వెల్లడించారు.