నాలుగో స్థానంకు పడిపోయిన తెలుగు..

SMTV Desk 2018-07-16 12:41:13  telugu language, hindi language, 2011 census, new delhi

న్యూఢిల్లీ, జూలై 15: దేశంలో నానాటికి తెలుగు మాట్లాడే వారే సంఖ్యా తగ్గుతుంది. హిందీ తర్వాత అత్యధికమంది మాట్లాడే భాషగా ఉన్న తెలుగు స్థానం పోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలుగు మాట్లాడే వారి సంఖ్య నాలుగోస్థానానికి పడిపోయింది. దేశంలో తెలుగుమాట్లాడే వారి సంఖ్య 1971లో 8.16% మంది ఉండగా ఇప్పుడు అది 6.70కి తగ్గిపోయింది. మరాఠీలు మనల్ని వెనక్కునెట్టి ఓ మెట్టు పైకెక్కారు. మొత్తంగా చూస్తే దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అదే సమయంలో ప్రాంతీయ భాషల ప్రభావం తగ్గుముఖం పడుతూ పోతోంది. 22 షెడ్యూల్డు భాషల్లో ఒక్క హిందీ మినహా మిగతా ప్రాంతీయ భాషలు మాట్లాడే వారి సంఖ్య పెరగలేదు. దేశంలో ఎక్కు వ మంది మాట్లాడే భాషల్లో మొదటి స్థానంలో హిందీ, రెండో స్థానంలో బెంగాలీ, మూడో స్థానంలో మరాఠీ, నాలుగో స్థానంలో తెలుగు నిలిచాయి. 2011 గణాంకాల ప్రకారం హిందీని 52.83 కోట్ల మంది మాట్లాడుతున్నట్లు వెల్లడైంది. ఇది 121 కోట్ల దేశ జనాభాలో 43.63 శాతం. 2001 నాటికి 42.2 కోట్ల మంది హిందీ మాట్లాడేవారని, పదేళ్లలో ఆ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది. తెలుగు తర్వాత ఐదో స్థానంలో తమిళం, ఆరో స్థానంలో గుజరాతీ నిలిచాయి.