జార్ఖండ్‌లో సామూహిక ఆత్మహత్యలు.. అప్పులే కారణం..

SMTV Desk 2018-07-15 13:20:32  Jharkhand family suicide, 6 family members died, Jharkhand, delhi

రాంచీ, జూలై 15 : ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని సామూహిక ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటన మరువక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జార్ఖండ్‌లోని హజారిబాగ్ నగరంలో జరిగింది. వీరిలో ఐదు మంది ఉరివేసుకొగా, మరొకరు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సూసైడ్‌నోట్‌ ఆధారంగా అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. డ్రై ఫ్రూట్ బిజినెస్‌లో భారీగా నష్టాలు రావడంతో ఒత్తిడికి లోనై వారంతా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మృతులు మహావీర్ మహేశ్వరీ(70), అతని భార్య కిరణ్ మహేశ్వరి(65), కొడుకు నరేశ్ అగర్వాల్(40), ఇతని భార్య ప్రీతీ అగర్వాల్(38), పిల్లలు అమన్(8), అంజలి(6)గా గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసు అధికారులు మాట్లాడుతూ.."ఈఘటనను సామూహిక ఆత్మహత్యలుగా పరిగణిస్తున్నాం. అప్పుల బాధ తాళలేక వీరంతా మృతి చెందినట్లు మాకు సమాచారం అందింది. మృతదేహాల పరిస్థితి చూస్తుంటే ఆదివారం తెల్లవారు జామునే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం" అని వెల్లడించారు.