అవాస్తవాలకు అడ్డుకట్ట వేస్తాం.. !

SMTV Desk 2018-07-07 15:08:52  facebook, 2019 india elections, fb fake news, delhi

ఢిల్లీ, జూలై 7 : ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్‌ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయాలకు సంబంధించి అసత్య ప్రచారాన్ని అడ్డుకుంటామని భారత ఎన్నికల కమిషన్‌కు హామీ ఇచ్చింది. రెండు నెలల కింద సియోల్‌లో వ్యక్తిగతంగా తనను కలిసిన భారత ఎన్నికల కమిషనర్‌ ఓం ప్రకాష్‌ రావత్‌కు సంస్థ గ్లోబల్‌ మేనేజరు కేటీ హర్బత్‌ ఈ మేరకు స్పష్టం చేశారు. ఈసీ (ఎన్నికల సంఘం) వర్గాలిచ్చిన సమాచారం ప్రకారం.. ఎన్నికల సమయంలో తమ నెట్‌వర్క్‌ ఆధారం చేసుకొని రాజకీయ పార్టీలు పెట్టే అన్ని అబద్ధపు పోస్ట్‌లను వైరల్‌ కాకుండా నిలువరించేందుకు ఫేస్‌బుక్‌ సమాయత్తమైంది. దీనికోసం నిజ నిర్ధరణ తనిఖీ పద్ధతిని వినియోగించేందుకు ఫేస్‌బుక్‌ నిర్ణయించింది. దీని ద్వారా ఫేస్‌బుక్‌లో ఎవరు ఏ పోస్టులు పెట్టినా, అవి వైరల్‌ అవ్వడానికి ముందు ఓ పరిధి దాటిన తర్వాత స్వీయ నిర్ధరణ వ్యవస్థ పరిధిలోకి వచ్చేస్తాయి. గతంలో కర్ణాటక ఎన్నికలు జరిగిన సమయంలో ఈ పద్ధతినే ఉపయోగించి అసత్య ప్రచారాన్ని అడ్డుకున్నట్లు హర్బత్‌ ఈసీకి చెప్పినట్లు సమాచారం. ఈసారి తమకు ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఒక్క ఫిర్యాదు కూడా అందబోదని నమ్ముతున్నట్లు ఈసీ ఆశాభావం వ్యక్తం చేసింది. తమ ఆధీనంలోనే ఉన్న వాట్సాప్‌లో సైతం అసత్య ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ఫేస్‌బుక్‌ ఇదే తోడ్పాటును అందిస్తుందని ఈసీ నమ్ముతోంది. ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు ప్రత్యేకంగా సాగించే అసత్యపు ప్రచారంపై నిఘా కచ్చితంగా ఉండాలని ఈసీ అంటోంది.