ముంబై లో భారీ వర్షాలు..

SMTV Desk 2018-07-03 11:52:20  mumbai heavy rains, mumbai rains, mumbai foot bridge fall, maharastra

ముంబై, జూలై 3 : దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంపై వరుణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. సోమవారం రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షం కారణంగా అంధేరీ రైల్వే స్టేషన్‌లో పాదచారుల వంతెన కూలింది. దీంతో పశ్చిమ రైల్వే సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి. పలువురు ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. థానేలో ఓ హౌసింగ్‌ సొసైటీ ప్రహరీ గోడ కూలడంతో 35ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ బీఎంసీ కమిషనర్‌, ముంబయి పోలీస్ ఛీఫ్‌లతో మాట్లాడారు. రైల్వే సర్వీసులు నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బస్సు సర్వీసులను పెంచాలని ఆదేశించారు. అంధేరీ స్టేషన్‌ వద్ద ఎస్వీ రోడ్డుపై ఉన్న వంతెన కూలడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విరార్‌- గోరెగావ్‌, బాంద్రా-చర్చిగేట్‌ల మధ్య రైళ్లు నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అత్యవసరమైతే తప్ప రైలు ప్రయాణాలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన పశ్చిమ రైల్వే రూట్లలో డబ్బావాలాలు తమ సేవలను నిలిపేశారు.