కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన ఊమెన్‌ చాందీ..

SMTV Desk 2018-07-01 16:25:49  nallari kiran kumar reddy, Indian statesman and senior leader, Oommen Chandy

హైదరాబాద్‌, జూలై 1 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని వ్యాఖ్యానించారు. నేడు ఆయన్ను ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్‌ చాందీ కలుసుకున్నారు. వీరి భేటీ కిరణ్‌ కుమార్‌రెడ్డి నివాసంలో జరిగింది. కిరణ్‌ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ఇటీవల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఊమెన్‌ చాందీ మాట్లాడుతూ "మా ఆహ్వానం పై కిరణ్‌ కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కే కాదు యావత్‌ భారత్‌ దేశానికి కీలక సమయం. విభేదాలను పక్కనపెట్టి దేశం కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. పార్టీ వీడిన నాయకులు అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం" అని అన్నారు. అప్పట్లో రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర విభజన తరువాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న వార్తలు ఇటీవలి కాలంలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు కిర‌ణ్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి.