అమర్‌నాథ్‌ యాత్రకు బ్రేక్..

SMTV Desk 2018-06-30 12:22:25  amarnath yatra, amaranath yatra pilgrims, break for amarnath yatra, sri nagar

శ్రీనగర్, జూన్ 30 : జమ్మూ కశ్మీర్ భారీ వర్షాలు, వరద హెచ్చరికల నేపథ్యంలో అధికారులు శుక్రవారమే అమర్‌నాథ్‌ యాత్రను నిలిపేశారు. రాష్ట్రంలో జీలం నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. గత రెండ్రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో సంగం వద్ద నది 21 అడుగులు దాటి ప్రవహిస్తోందని అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2014లో కశ్మీర్‌లో వచ్చిన వరదల కారణంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. యాత్ర ప్రారంభమైన తర్వాత నిలిపేయడం ఇది రెండోసారి. భారీ వర్షాల కారణంగా యాత్రకు వెళ్లే మార్గాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. యాత్రికులందరినీ సురక్షితంగా బేస్‌ క్యాంపుల్లో ఉంచినట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత తిరిగి యాత్ర ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.