ఆ వార్తలను ఖండించిన తేజస్వీ యాదవ్‌ ..

SMTV Desk 2018-06-11 12:03:55  rjd party, tej prathap yadav, tejaswi yadav, bihar

బీహార్, జూన్ 11: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ తనయుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై ఆయన చిన్న కుమారుడు, బిహార్‌ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌ స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... " తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ నా సోదరుడే కాదు.నా గైడ్‌ కూడా. మా అన్నయ్య(తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌) నా మార్గదర్శి. 2019 లోక్‌సభ, 2020లో బిహార్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను ఒక్క దారిలోకి తెచ్చి పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు" అంటూ తేజస్వీ అన్నారు. ప్రస్తుతం బిహార్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్న తేజస్వి.. వాటి నుంచి ప్రజల దృష్టి మరలించడానికే కొంతమంది ఇలాంటి చౌకబారు వదంతులు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 మార్కులకు 38 మార్కులు రావడం, 44 మంది మహిళలపై అత్యాచారాలు జరగడం ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. విద్యావ్యవస్థ ఏ విధంగా నాశనమౌతోందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారన్నారు. ఇలాంటి అంశాలను తేలికగా తీసుకుంటే రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తేజస్వీ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటున్న తేజస్వీ ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి వ్యూహరచన చేసి తన రాజకీయ ప్రతిభను చాటుకున్నారు. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైనప్పుడూ ఎంతో హుందాగా వ్యవహరించారు. అక్కడ సోనియాగాంధీ, మమతాబెనర్జీ, మాయావతి, రాహుల్‌గాంధీ తదితర జాతీయస్థాయి నేతలతో సన్నిహితంగా మెలిగారు. దీంతో తమ్ముడు తేజస్వీ యాదవ్‌ పార్టీలో క్రియాశీలకంగా మారుతుండటం, తండ్రి వారసత్వాన్ని ఆయనే అందిపుచ్చుకుంటాడన్న అభిప్రాయలు వినబడుతున్నాయి. దీంతో లాలూ పెద్దకుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.