చెత్రీ మెరిసెన్.. భారత్ గెలిచెన్..

SMTV Desk 2018-06-11 11:47:54  Intercontinental Cup 2018, foot ball match, india vs kenya, lionel messi,

ముంబై, జూన్ 11 : టీమిండియా ఫుట్ బాల్ జట్టు ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఇంటర్‌ కాంటినెంటెల్‌ కప్‌ ఫైనల్‌లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ సునీల్ చెత్రీ రెండు గోల్స్‌ సాధించి భారత్‌ విజయంలో కీలక పాత్రను పోషించాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో చేసిన రెండో గోల్‌తో ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ సరసన చేరాడు. నేడు జరిగిన మ్యచ్‌లో 2-0 తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సాధించిన రెండు గోల్స్‌ చత్రీ చేసినవే కావడం గమనార్హం. మ్యాచ్‌ 8వ నిమిషంలో తొలిగోల్‌ చేసిన చత్రీ అదే ఊపులో 28వ నిమిషంలో మరో గోల్‌ చేశాడు. దీంతో భారత్‌కు 2-0 ఆధిక్యం లభించింది. మధ్యలో కెన్యాకు గోల్‌ చేసే అవకాశం వచ్చినా ఆ జట్టు ఆటగాళ్లు దానిని వినియోగించుకోలేదు. దీనికి తోడు భారత్‌ ఆటగాళ్లు సమర్థంగా కెన్యా ఆటగాళ్లను నిలవరించారు. లీగ్‌ దశలో కూడా భారత్‌ జట్టు కెన్యాపై 3-0 తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో చెత్రీ అర్జెంటీనా స్టార్‌ మెస్సీ సరసన చేరాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్‌ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీతో జత కట్టాడు. మెస్సీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్‌ చేయగా... చెత్రీ 102 మ్యాచ్‌ల్లోనే 64 గోల్స్‌ సాధించాడు. ఈ జాబితాలో పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో (150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్‌) అగ్రస్థానంలో ఉన్నాడు.