ప్లాస్టిక్ వాడకంపై తమిళ సర్కార్ కీలక నిర్ణయం..

SMTV Desk 2018-06-05 18:46:12  Tamil Nadu plastic, cm Edappadi Palaniswami, world envirnoment day, june 5

తమిళనాడు, జూన్ 5 : ప్రపంచ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు ప్లాస్టిక్. ఎన్నో అనర్ధాలకు మూల హేతువు ఈ ప్లాస్టిక్ భూతం. కాగా ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.కాగా తమిళనాడు ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అంటే 2019 జనవరి 1 నుంచి పూర్తిగా తమ రాష్ట్రంలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సోమవారం ఈ మేరకు సీఎం పళని స్వామి ప్రకటించారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను ఇక నుంచి తమిళనాడులో తయారు చేయడం... వాడటాన్ని ఆయన నిషేధించారు. అయితే పాలు - అయిల్ ఫౌచ్ లు - మెడికల్ యుటిలిటీస్ - ఇతర ప్రాథమిక ఉత్పత్తులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు నిస్తున్నామని సీఎం తెలిపారు. రూల్ 110 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. గుజరాత్ రాష్ట్రం కూడా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ప్రజారవాణా మార్గాలు - గార్డెన్లు - ప్రభుత్వ ఆఫీసుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నేటినుంచే నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.