తుత్తుకూడి బాధితులను పరామర్శించిన రజనీ..

SMTV Desk 2018-05-30 13:13:07  rajni kanth, tuticoron incident, sterlite copper factory, chennai

చెన్నై, మే 30 : తూత్తుక్కుడి(ట్యూటీకోరిన్‌)లో స్టెరిలైట్‌ బాధితులను ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ పరామర్శించారు. తూత్తుక్కుడిలో స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 13 మంది అమాయకులు పోలీసుల తూటాలకు బలైన విషయం తెలిసిందే. అయితే బాధితులను పరామర్శించేందుకు తాను తూత్తుక్కుడి వెళ్తున్నానని బుధవారం ఉదయం రజనీ వెల్లడించారు. ఈరోజు తూత్తుకుడి చేరుకున్న ఆయన.. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. బాధితులను పరామర్శించిన అనంతరం రజనీకాంత్‌ మీడియాతో మాట్లాడారు. బాధితులకు ఆర్థికంగా అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ఈ సందర్భంగా రజనీ వెల్లడించారు. ఈ ఘటన ప్రభుత్వానికి గుణపాఠం లాంటిదని.. ఇలాంటివి మరోసారి జరగకుండా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈనెల 22న స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది మృతిచెందారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతరం ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించింది. కాగా, సోమవారం ఈ ప్లాంట్‌ను మూసివేయాల్సిందిగా సీఎం పళిని స్వామి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమకు సీలు వేశారు.