ఢిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ను ప్రారంభించిన మోదీ..

SMTV Desk 2018-05-27 16:54:25  Delhi-Meerut Expressways, Delhi-Meerut Expressways modi, delhi, delhi express way

ఢిల్లీ, మే 27 : బీజేపీ ప్రభుత్వం ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడంలో ఎనలేని కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే తొలి దశను మోదీ ఆదివారం ప్రారంభించారు. దీంతో ఢిల్లీ-మీరఠ్‌ల మధ్య 14వరుసల ఎక్స్‌ప్రెస్‌ హైవే అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు దేశంలోనే తొలి ఆకర్షణీయ పర్యావరణ ప్రాంతంగా పేరు పొందనుంది. రహదారుల పరిరక్షణ, రోడ్డు భద్రతల మీద ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. " దేశ రాజధాని ప్రాంతంలోనే ఇంత దారుణంగా ఉంటే మన దేశానికే చెడ్డపేరు. ట్రాఫిక్‌ సమస్యా దేశంలో తిష్ఠ వేసుకుని కూర్చుంది. భాజపా ప్రభుత్వం ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడంలో ఎనలేని కృషి చేస్తోంది. ఈరోజు దేశ చరిత్రలోనే నిలిచిపోయే రోజు. భారతీయులందరూ సగర్వంగా తలెత్తుకుంటారు. ఇప్పుడు ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా ట్రాఫిక్‌ కష్టాలకు చెల్లుచీటీ పెట్టదలుచుకున్నాం. ఈ రహదారి ద్వారా ప్రయాణించాలంటే వాహనదారులు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇప్పుడీ ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా ఢిల్లీ-మీరట్‌కు కేవలం 45నిమిషాల్లోనే ప్రయాణించగల వెసులుబాటు కలగనుంది" అని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల దాదాపు గంట ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 28కి.మీపాటు సైకిళ్లపై కూడా ప్రయాణించే సౌకర్యం ఉంది. కేవలం 18నెలల కాలంలోనే ఈ రహదారి మొదటి దశ నిర్మాణం పూర్తయింది. ఈ రహదారిపై 11 వంతెనలు, ఐదు పెద్ద, 24చిన్న వంతెనలు, 3 ఆర్‌ఓబీ(రైల్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు),36 వెహిక్యులర్‌, 14 పాదచారుల అండర్‌ పాస్‌లు ఉన్నాయి.