స్టెరిలైట్‌ కు విద్యుత్ బంద్..

SMTV Desk 2018-05-24 13:09:59  sterlite, tuticoron sterlite, tamilanadu pollution control board, tamilanadu

తూత్తుకుడి, మే 24 : గత కొన్ని రోజులుగా తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో స్టెరిలైట్‌ రాగి కర్మాగారం విస్తరణను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంచితే.. ఆందోళనల నేపథ్యంలో కర్మాగారానికి విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరాను ఆపివేశారు. మంగళవారంస్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా తూత్తుకుడి కలెక్టరు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇది హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతిచెందారు. ఆందోళనల దృష్ట్యా పరిశ్రమలో ఉత్పత్తిని నిలిపివేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. ప్లాంట్‌ లైసెన్స్‌ను పునరుద్ధరించేంత వరకూ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టి పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి రావడంతో... మండలి ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది.