ప్రేయసి కోసం.. ప్రియుడు సాహసం..

SMTV Desk 2018-05-22 19:00:54  Jamia Millia Islamia University, hacking of jamia millia university, lover pooja, delhi

ఢిల్లీ, మే 22 : సాధారణంగా తను ప్రేమించిన అమ్మాయికి అబ్బాయిలు పుట్టిన రోజు కానుకలు గా మంచి బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరుస్తారు. కానీ ఓ ప్రేమికుడు ప్రేయసికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఓ సాహసమే చేశాడు. అదేంటంటే.. ఏకంగా యూనివర్శిటీ వెబ్‌సైట్‌నే హ్యాక్‌ చేశాడు. ఈ ఘటన దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో జరిగింది. సోమవారం రాత్రి ఓ ఆగంతకుడు ‘హ్యాపీ బర్త్‌డే పూజా. యువర్ లవ్’ అని విషెస్‌ వచ్చేలా వెబ్‌సైట్‌ లింక్‌ను హ్యాక్‌ చేశాడు. అయితే ఇది ఎవరు చేశారన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. వర్శిటీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరిగి వెబ్‌సైట్‌ను ప్రారంభించడానికి తమకు ఏడు గంటల సమయం పట్టిందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వ్యక్తిగత సందేశాలు పంపుకోవడానికి ఇలా యూనివర్శిటీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేయడం తగదని నిందితుడు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వర్శిటీ మీడియా ప్రతినిధి సైమా సయీద్‌ పేర్కొన్నారు. వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయినట్లు తమకు అర్థరాత్రి 1 గంట సమయంలో తెలిసిందని దాంతో వెంటనే బాగుచేయడానికి ప్రయత్నించామని తెలిపారు. గతంలో ఢిల్లీ, ముంబయి, చెన్నైలోని ఐఐటీ వర్శిటీల వెబ్‌సైట్లు కూడా ఇదే విధంగా హ్యాకింగ్ కు గురయ్యాయి. కళాశాలల వెబ్‌సైట్లే కాకుండా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వెబ్‌సైట్లపై కూడా సైబర్‌ దాడులు జరిగాయి. దీనిపై ఎన్‌ఐసీ(జాతీయ సమాచార కేంద్రం) స్పందిస్తూ సాంకేతిక లోపాల కారణంగా వెబ్‌సైట్లు పనిచేయలేదని వెల్లడించింది.