యుద్ధ క్షేత్రంగా మారిన తూత్తుకుడి..

SMTV Desk 2018-05-22 18:35:52  Anti-Sterlite protests, Tuticorin , Vedantas Sterlite Copper unit, tamilanadu

చెన్నై, మే 22 : తమిళనాడులోని తూత్తుకుడి యుద్ధ క్షేత్రంలా మారింది. తూత్తకుడిలోని స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని చేపట్టిన ఆందోళనలో తొమ్మిది మంది నిరసనకారులు దుర్మరణం పాలయ్యారు. కొన్ని నెలలుగా ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఉదయం జరిగిన పరిణామాల తర్వాత కాసేపు శాంతించిన ఆందోళనకారులు మళ్లీ రెచ్చిపోయారు. ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించగా.. పోలీసులు కాల్పులకు దిగారు. కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, ఆందోళనలో మొత్తం మృతుల సంఖ్య 11కి చేరుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీని మూసేయాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానికులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా, అది కాస్త హింసకు దారీ తీసింది. 1996లో స్టెరిలైజ్ ప‌రిశ్ర‌మ ప్రారంభించిన‌ప్ప‌టి నుండి త‌ర‌చూ ఆందోళ‌న‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ క‌ర్మాగారాన్ని విస్త‌రించాల‌ని ప్రయత్నించడం మ‌రింత వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మైంది. దీనికార‌ణంగా భూగ‌ర్భ జ‌లాలు క‌లుషిత‌మ‌వుతున్నాయినీ, ప్ర‌జ‌ల‌కు శ్వాస సంబంధ‌మైన ఇబ్బందులు త‌లెత్త‌డంతో పాటు మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్టు స్థానికులు మండిపడుతున్నారు.