ఉత్కంఠకు తెరదించిన భారత్, చైనా అధ్యక్షులు

SMTV Desk 2017-07-08 12:00:59  indian, presindent, narendra modi, china, president, jan pink, brics, Coalition

హాంబర్గ్, జూలై 8 : ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌ నిబద్ధత ప్రశంసనీయమైనది. ఆర్థిక, సామాజికాభివృద్ధిలో మంచి పురోగతిని సాధించింది. భారత్‌ నేతృత్వం వహించిన సమయంలోనూ బ్రిక్స్‌ కూటమి మంచి పురోగతిని సాధించింది. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని నేను కోరుకుంటున్నా. 20‌16లో గోవాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సు దీనికి నిదర్శనమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు.సిక్కిం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత, రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుందేమోనన్న భయాందోళనల మధ్య భారత్‌, చైనాల అగ్రనేతలు కరచాలనం చేసుకుని మాటా మాటా కలిపారు. అసలు వీరిద్దరూ ఎదురుపడితే కనీసం మర్యాదపూర్వక పలకరింతలైనా ఉంటాయా అన్న ఉత్కంఠను బ్రేక్ చేస్తూ దాదాపు అయిదు నిమిషాల పాటు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. శుక్రవారం జర్మనీలోని హాంబర్గ్‌లో ప్రారంభమైన జీ20 సదస్సు సందర్భంగా బ్రిక్స్‌ దేశ నేతల భేటీ కూడా అనధికారికంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ కలివిడిగా మాట్లాడుకున్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్‌ బాగ్లే ట్వీట్‌ చేశారు. వీరిద్దరి భేటీ, అసలు పర్యటన షెడ్యూలులోనే లేదని రెండు దేశాల అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనికి భిన్నంగా నేతలిద్దరూ కలిసి మాట్లాడుకోవటం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డోక్లామ్‌ ప్రతిష్ఠంభనపై ఇరు దేశాల మధ్య ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగుతునే ఉన్నాయి. బ్రిక్స్‌ నేతల భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను ప్రశంసించారు. ప్రస్తుతం బ్రిక్స్‌ (బ్రెజల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి చైర్మన్‌గా జిన్‌పింగ్‌ ఉన్నారు. సెప్టెంబరులో చైనాలోని షియామెన్‌లో నిర్వహించబోయే బ్రిక్స్‌ సదస్సుకు పూర్తి సహకారమందిస్తామని మోదీ చెప్పారు. గల్ఫ్‌, కొరియా ద్వీపకల్పంలోని పరిస్థితులపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు సభ్యదేశాలన్నీ కలసి రావాలని, ప్రపంచ ఆర్థిక పురోగతికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. బ్రిక్స్‌కు ప్రత్యేకంగా కెడ్రిట్‌ రేటింగ్‌ సంస్థ ఉండాలని సూచించారు. భారత్‌లో తీసుకొచ్చిన పన్నుల సంస్కరణ జీఎస్‌టీని మోదీ ప్రస్తావిస్తూ, వాణిజ్యం, విజ్ఞానం, వృత్తినిపుణుల విషయాల్లో స్వీయ రక్షణాత్మక విధానాలకు వ్యతిరేకంగా బ్రిక్స్‌ గళం విప్పాలని కోరారు. ఈ సమావేశంలో బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా నేతలు కూడా పాల్గొన్నారు.