విద్యుత్ శాఖలో 2 వేల కొలువులు!

SMTV Desk 2018-04-13 15:33:58  TSSPDCL, JLM Recruitment, telangana

హైదరాబాద్, ఏప్రిల్ 13‌: విద్యుత్ శాఖలో పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ కసరత్తు ప్రారంభించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న 2 వేల జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులను రెండు విడతల్లో భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. తొలి విడతగా వచ్చే నెల తొలి వారంలో 1,000 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయనుంది. పోస్టుల భర్తీ ప్రతిపాదనలను ఈ నెలాఖరులో నిర్వహించే బోర్డు సమావేశంలో ఆమోదించాక వచ్చే నెల తొలి వారంలో నియామక ప్రకటన జారీ చేస్తామని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి. రఘుమారెడ్డి తెలిపారు. జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో తొలిసారిగా మహిళా కోటా అమలుచేసే అంశాన్ని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిశీలిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా జేఎల్‌ఎంలు విద్యుత్‌ స్తంభాలు ఎక్కి పని చేయాల్సి ఉండనుండటంతో ఇప్పటివరకు ఈ పోస్టుల భర్తీలో మహిళలకు అవకాశం కల్పించలేదు. అయితే జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో సైతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మహిళా నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జారీ చేయనున్న జేఎల్‌ఎం పోస్టుల నియామకాల్లో మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించే అంశాన్ని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాజమాన్యం పరిశీలిస్తోంది.