ఆర్టీసీపై వరాల చిరుజల్లులు కాదు...వరాల జడివాననే

SMTV Desk 2019-12-02 15:46:39  

అవును. ఆర్టీసీపై వరాల చిరుజల్లులు కాదు...వరాల జడివాననే కురిపించారు సిఎం కేసీఆర్‌. సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించడానికి 47 కోట్లు ఇమ్మనమని హైకోర్టు పదేపదే విజ్ఞప్తి చేసినప్పుడు అంత భారం మోయలేమని చెప్పిన సిఎం కేసీఆర్‌ ఇపుడు ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు సోమవారం చెల్లిస్తామని, సమ్మె కాలానికి మొత్తం జీతం ఒకేసారి చెల్లిస్తామని ప్రకటించడం విశేషం. అంతేకాదు...ఇకపై ప్రతీ ఏడాది ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

ఒక్కో డిపో నుంచి ఐదుగురు చొప్పున రాష్ట్రంలో 97 డిపోల నుంచి వచ్చిన ఆర్టీసీ కార్మికులతో సిఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో వారి సమస్యలన్నీ అడిగి తెలుసుకొన్నారు. అనంతరం సుమారు రెండు గంటలపాటు వారిని ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఆర్టీసీకి ప్రకటించిన వరాలు ఇవే..

• సెప్టెంబరు వేతనం నేడు (సోమవారం) చెల్లింపు.

• సమ్మె కాలానికి వేతనం ఏకమొత్తంగా జీతం చెల్లింపు.

• ఏటా బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు కేటాయింపు.

• రిటైర్మెంట్‌ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు.

• మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం. ఉద్యోగం. దరఖాస్తు చేసుకోకపోయినా వారం రోజులలోగా ఉద్యోగం ఇస్తాం.

• పీఎఫ్‌, సీసీఎస్‌ బకాయిలు చెల్లిస్తాం.

• ఆర్టీసీ ఉద్యోగులకు గృహ నిర్మాణ పథకం.

• తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తాం.

• .ఇకపై మహిళా ఉద్యోగులకు నైట్‌ డ్యూటీలు వేయబోము.

• మహిళా ఉద్యోగులకు ఖాకీ డ్రెస్‌ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్‌ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం.

• మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు.. చైల్డ్‌ కేర్‌ నిమిత్తం 3 నెలలు ప్రత్యేక శలవు మంజూరు చేస్తాం.

• డిసెంబర్ నెలాఖరులోగా రాష్ట్రంలో ప్రతి డిపోలో మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు, డ్రెస్‌ చేంజ్‌ రూమ్స్‌, లంచ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేస్తాం. .

• మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీల ఏర్పాటు.

• ఆర్టీసీ కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తాం.

• ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు, తల్లితండ్రులకు బస్‌పాస్‌, వైద్యంకల్పిస్తాం.

• ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టబోము.

• రెండేళ్లపాటు యూనియన్‌ ఎన్నికలు రద్దు.

• పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్‌ వేసుకునే అవకాశం కల్పిస్తాం.

• తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేస్తాం.

• టికెట్ తీసుకోవాలసిన బాధ్యత ప్రయాణికుడిదే. ఒకవేళ చెకింగులో టికెట్ లేని ప్రయాణికులు పట్టుబడితే వారిపైనే చర్యలు తీసుకొంటారు తప్ప కండక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోరు.

• కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్నవారిని వేరే విధులు కేటాయిస్తాం తప్ప ఉద్యోగం నుంచి తొలగించము.

• ప్రతి డిస్పెన్సరీలో ఉద్యోగులకు అవసరమైన మందులను ఉంచి ఉచితంగా పంపిణీ చేస్తాం.

• ప్రతీ డిపోలో బస్సుల మరమత్తుల కోసం అవసరమైన టూల్స్, విడిభాగాలు అందుబాటులో ఉంచుతాము.

• త్వరలో మళ్ళీ ఆర్టీసీలో పార్సిల్‌ సర్వీసులను ప్రారంభిస్తాం.

• ఏడాదికి ఓసారి డిపో సిబ్బంది వన భోజనాలకు వెళ్లండి. ఆడిపాడండి.

• ఇక నుంచి ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులుగా పిలుస్తాం.

• ఆర్టీసీని లాభాల బాటలో పట్టించినా తరువాత మళ్ళీ వచ్చే ఏడాది అందరం కలిసి ప్రగతి భవన్‌లో విందు భోజనం చేద్దాం.