మేడారం జాతరకు వెళ్తూ.. అన౦త లోకాలకు..

SMTV Desk 2018-01-31 17:18:04  medaram jathara, sad incident, women died, road accident.

వరంగల్, జనవరి 31 : మేడారం మహా జాతరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఈ ట్రాఫిక్ లో చిక్కుకొని ఓ బాలింత మృతి చెందింది. రెండు రోజుల క్రితం కుటుంబంతో జాతరకు వచ్చిన ఆ నిండు గర్భిణికి నొప్పులు రావడంతో ఆమెను ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో ములుగు ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దీంతో స్పృహ కోల్పోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదిలా ఉండగా మరోవైపు భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతిచెందారు. తాడ్వాయి ఎస్సై కరుణాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వాపురం మండలం చెవిటిగూడెంకు చెందిన ఆటో డ్రైవర్‌ పి.అంజయ్య(50) తన కుమారుడు నవీన్‌(23)లు జాతరకు వెళుతుండగా తాడ్వాయి-పస్ర జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.