తెలంగాణ అంటే చాలా ఇష్టం : పవన్ కళ్యాణ్

SMTV Desk 2018-01-23 15:34:33  janasena party, pawan kalyan, karimnagar, praja yatra.

కరీంనగర్, జనవరి 23 : జనసేన పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్‌ జిల్లా కార్యకర్తలతో సమావేశమైన పవన్‌ ఈ సందర్భంగా మాట్లాడారు. "ఆంధ్రా, తెలంగాణ వేరు వేరు కాదు.. నా తాపత్రయం అంతా దేశం కోసమే. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపై ఉంది. అవినీతి లేని సమాజం కోసం యువత సిద్ధం కావాలి" అంటూ పేర్కొన్నారు. అలాగే తనకు తెలంగాణ ఇష్టమంటూ తెలంగాణపై తన భావోద్వేగాన్ని ప్రజలతో పంచుకున్నారు. "తెలంగాణ అంటే చాలా ఇష్టం.. అంతే కాదు ప్రేమ.. ప్రాణం కూడా. తెలంగాణ యాస, భాష, సంస్కృతిని నా సినిమాల్లో ప్రోత్సహిస్తా. తెలంగాణ యాస, భాషను గౌరవించి ఉనికిని బలంగా చాటి చెప్పాలి. బతుకమ్మ, సమ్మక్క-సారలమ్మ, సదర్‌ ఉత్సవాలను కాపాడుకోవాలి" అని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా.? అనే విషయంపై మాట్లాడుతూ.. " జనసేనను వేరే పార్టీలో విలీనం చేయాల్సి వస్తే నేను మీ ముందు ఎలా ఉంటాను. 2019లో తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మాట ఇస్తే తిరిగి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. తెలంగాణ యువత, ఆడపడుచుల ఆకాంక్షే.. జనసేన ఆకాంక్ష. తెలంగాణ ఆశయాల కోసం జనసేన నిలబడుతుంది. నాకు అండగా ఉండండి. నాకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా" అని తెలిపారు.