తెలంగాణాలో పెట్టుబడులు పెట్టండి: ద.కొరియా సంస్థలతో కేటీఆర్‌

SMTV Desk 2018-01-17 13:15:39  ktr, south koria, investments, telangana, siyol

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పెద్దఎత్తున తరలిరావాలని దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్‌ విన్నవించారు. రాష్ట్రంలో జౌళి, ఔషధ, ఐటీ, చరవాణులు, వాహనాల తయారీ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. కొరియాకు తెలంగాణతో సత్సంబంధాలున్నాయని, రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ఎక్కడా లేని విధంగా భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా కేవలం పక్షం రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, కొరియా నుంచి సైతం వారు దరఖాస్తు చేసుకుంటే నేరుగా వారికే అనుమతి పత్రాలను పంపిస్తామన్నారు. కొరియా సంస్థలు కోరితే ప్రత్యేక పార్కులు, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తామన్నారు. 1.50 లక్షల ఎకరాల భూబ్యాంకును ఏర్పాటు చేశామని, పెట్టుబడులకు ఆసక్తిగల సంస్థలకు సత్వరమే భూ కేటాయింపులు జరుపుతామన్నారు. సియోల్‌లో కొరియా మొబైల్‌ ఇంటర్నెట్‌ వ్యాపార సంఘంతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకు౦ది.