వచ్చే సార్వత్రిక ఎన్నికలే నాకు చివరివి: నాగం

SMTV Desk 2018-01-12 16:43:42  nagam janardhan reddy, bjp, contest, last, elections, party change

నాగర్‌కర్నూలు, జనవరి 12: భాజపా నేత నాగం జనార్దన్‌రెడ్డికి వచ్చే సార్వత్రిక ఎన్నికలే చివరివి కానున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే స్పష్టంచేశారు. ఇంకా పార్టీ మారే విషయంపై కూడా కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. పార్టీ మారుతున్నట్టు తనపై వస్తున్న ఊహాగానాలకు నాగం జనార్దన్‌రెడ్డి స్పందిస్తూ..ప్రస్తుతానికి భాజపాలోనే కొనసాగుతున్నా. ఉగాది తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. తెలంగాణలో భాజపాకు ఎదుగుదల లేదనే అభిప్రాయంతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారన్నారు. కొందరు కార్యకర్తలు, నాయకులు తన దగ్గర ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారని, ఉగాది తర్వాత నిర్ణయం తీసుకుందామని, అంతవరకు ఆగాలని చెప్పానన్నారు. మరోవైపు తెలంగాణ రాజకీయ ఐకాస కొంతకాలం క్రితం నాగంను సంప్రదించినట్లు చర్చ జరుగుతోంది. ఐకాస రాజకీయ పార్టీగా మారే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆయన ఇతర పార్టీలవైపు చూస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌, తెరాసల్లో ఏపార్టీలోకి వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. నాగం కొంతకాలంగా ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతుందంటూ, అధికారపార్టీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈవిషయంపై నాగం స్పందిస్తూ తాను ఏ పార్టీతోనూ సంప్రదింపులు జరపలేదని తెలిపారు.