పసిఫిక్‌ అగ్ని వలయ ప్రభావిత ప్రాంతాలకు భారత్ తర్ఫీదు

SMTV Desk 2018-01-07 11:58:37  incois, training, phasific ring of fire, india

హైదరాబాద్, జనవరి 07: ప్రపంచ మహాసముద్ర అధ్యయనంలో భారత్‌కు అరుదైన గౌరవ౦ దక్కి౦ది. ఇన్నాళ్లూ హిందూ మహాసముద్రానికే పరిమితమైన పరిశోధనలు.. ఇప్పుడు పసిఫిక్‌ మహాసముద్రంవైపు సాగుతున్నాయి. నెలకోసారి పసిఫిక్‌ ద్వీపకల్పాలను అతలాకుతలం చేస్తున్న సునామీలపై హైదరాబాద్‌లోని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్‌కాయిస్‌) శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. భయంకరమైన పసిఫిక్‌ అగ్ని వలయం (పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌) ప్రాంతాలకు ఆపన్నహస్తం అందించారు. దీంతో మహాసముద్రాలపై భారత్‌ పట్టు సాధిస్తోంది. పసిఫిక్‌ మహాసముద్రంలో పసిఫిక్‌ అగ్ని వలయ౦ భయంకరమైన ప్రాంత౦. ప్రపంచంలోని 90% భూకంపాలు అక్కడే సంభవిస్తాయి. వాటిలో 80% అత్యంత తీవ్రంగా ఉంటున్నాయి. అందుకే దీనిని ‘పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’గా పిలుస్తున్నారు. సముద్రగర్భంలోని భూఫలకాలు ఎక్కువగా కదులుతూ చిన్న, పెద్ద అనే తేడాలేకుండా భూకంపాలు నిత్యం నమోదవుతుంటాయి. వాటిలోని తీవ్రమైన భూకంపాలు సునామీని సృష్టిస్తాయి. వీటి కారణంగా ప్రాణ, ఆర్థిక నష్టం భారీగా ఉంటుంది. పసిఫిక్‌ ద్వీపకల్ప దేశాలు సాంకేతికంగా అభివృద్ధి చెందలేదు. అందువల్ల మొదటిదశ కింద అగ్ని వలయ పరిధిలోని మార్షల్‌, పలావు, సోలోమన్‌, సమోవా, నౌరు, నువే, వనౌతు, కిరిబలి, ఫిజి, కుక్‌ఐలం, టోంగ దేశాల ప్రతినిధులకు భారత్ తర్ఫీదు ఇచ్చింది. సునామీలను ఎదుర్కొనేందుకు ఇన్‌కాయిస్‌ రూపొందించిన వ్యవస్థలను ఆయా దేశాలకు వివరించి, అవి సాధించిన కచ్చితమైన ఫలితాలను భారత్ వాటికి చూపించింది. దీంతో అప్పటివరకు అమెరికా సాయం తీసుకుంటున్న దేశాలు ఇప్పుడు భారత్‌వైపు దృష్టి మళ్లించాయి.