కోత లేదు.. కొరత రాదు : కేసీఆర్

SMTV Desk 2017-12-29 16:18:56  telangana, kcr, 24 hrs power suppply, agricultral sector,

హైదరాబాద్, డిసెంబర్ 29 : కరెంటు లేక, నీళ్లు లేక ఎండిపోయిన పంటపొలాలంటూ ఇకపై తెలంగాణ గడ్డ పై ఉండవు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31 అర్ధరాత్రి 12:01 గంటలకు నిరంతర సరఫరాను ప్రారంభించి, రైతాంగానికి నూతన సంవత్సర కానుక అందించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. “ దశాబ్దాల కాలంగా రైతులు కరంట్ కష్టాలు అనుభవిస్తున్నారు. రైతులకు 24 గంటలు నిరంతరాయ విద్యుత్ ఇవ్వడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. వ్యవసాయదారులతో పాటు అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని నిర్ణయించాం. దీనివల్ల రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఇవ్వడం సాధ్యమవుతుంది. అందుకే ప్రస్తుత అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు ఎటువంటి కొరత లేకుండా ఉండేలా విద్యుదుత్పత్తి పెంచుతున్నాం. ఇప్పుడిక తెలంగాణ కరెంట్‌ కోతలంటే ఏమిటో తెలియని రాష్ట్రంగా చూడబోతున్నాం” అని వ్యాఖ్యానించారు.