హైదరాబాద్ లో ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్

SMTV Desk 2017-06-18 16:40:02  Interpretion Center, hyderabad, Qutub Shahi tombs

హైదరాబాద్, జూన్ 18 : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌.. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనశాలలకు ప్రత్యామ్నాయంగా మారిన సరికొత్త ప్రక్రియ. ఓ చారిత్రాత్మక ప్రాంతానికి వెళ్తే.. దాని ప్రత్యేకతలు తెలుసుకునేందుకు సందర్శకులు అక్కడి ప్రాంతంలో మ్యూజియం కోసం వెదుకుతారు. మన దేశంలో వీటి జాడ అంతగా లేనప్పటికీ, విదేశాల్లో అన్ని ప్రధాన సందర్శనీయ ప్రాంతాల్లో మ్యూజియంలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు మన దేశంలో కూడా ఆధునికంగా ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. త్రీడీ పరిజ్ఞానంతో సరికొత్తగా విషయాలను మనముందుంచే ఏర్పాట్లు కూడా ఉంటు న్నాయి. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ కేంద్రాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తొలిసారిగా ఓ భారీ సెంటర్‌ ఏర్పాటు కాబో తోంది. ఈ నిర్మాణం పూర్తయితే ఇది దేశంలోనే పెద్ద ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ కానుంది. దీనికి కుతుబ్‌షాహీ టూంబ్స్‌ ప్రాంగణం వేదిక కాబోవడం విశేషం, కేంద్ర ప్రభుత్వ పథకం ‘స్వదేశీ దర్శన్‌’ కింద దాదాపు రూ.45 కోట్ల భారీ వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. కుతుబ్‌ షాహీల సమాధులను అంతర్జాతీయ ప్రమాణా లతో అభివృద్ధి చేస్తున్న ఆగాఖాన్‌ ట్రస్ట్‌ పనులకు అదనంగా కేంద్రం దీనిపై భారీగా వ్యయం చేయబోతున్నట్లు వెల్లడైంది. ఇటీవల స్వదేశీ దర్శన్‌ పథకం కింద రూ.94 కోట్లు మంజూరు చేశారు. ఇందులో సింహభాగం కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని ఈ సందర్భంగా కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణ అభివృద్ధిపై పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం సమీక్ష జరిపారు. సమావేశంలో ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ నిర్మాణంపైనా చర్చించారు. కుతుబ్‌షాహీ సమాధులను ప్రాధాన్య పర్యాటక కేంద్రంగానే కాకుండా యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీ రాజవంశానికి చెందిన పాలకుల సమాధులు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ప్రపంచంలో మరే రాజవంశానికి ఈ అవకాశం దక్కలేదు. దీంతో ఆ వంశానికి చెందిన అన్ని వివరాలను ప్రజల ముగింట ఉంచే బృహత్తర ఏర్పాట్లు జరుగుతున్నాయి. టూంబ్స్‌ ప్రాంగణంలోని విశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేసి భారీ హంగులతో ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. పురావస్తు శాఖ అధికారులతో పాటు ఆగాఖాన్‌ ట్రస్టు ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.