ఘనంగా మాజీ ప్రధాని పీవీ వర్ధంతి వేడుకలు

SMTV Desk 2017-12-23 14:38:51  pv narasimharao, death anniversary, 13, tribute, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 23: రాజకీయ చాణుక్యుడు, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు, తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని జ్ఞానభూమి వద్ద పీవీకి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులు నివాళులర్పించారు. జూన్ 28, 1921న జన్మించిన పీవీ నరసింహారావు 2004, డిసెంబర్ 23న స్వర్గస్తులైనారు. పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలిగా, భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. ఈ సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు. మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రధానిగా ఎదిగిన ఆయన ప్రస్థానం చిరస్మరణీయం. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పీవీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా సేవలందించారు. కేంద్ర రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన గొప్ప వ్యక్తి పీవీ. దేశంలో తన రాజకీయ చతురతతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన చనిపోయినప్పుడు కనీసం స్మారక చిహ్నం కూడా ఢిల్లీలో పెట్టలేదని ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించారు. తెలంగాణాలో అధికారికంగా పీవీ వర్ధంతి సంస్మరణ సభను నిర్వహిస్తున్నామని, చరిత్రలో నిలిచిపోయే కొంతమంది వ్యక్తుల్లో పీవీ ఒకరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.