విజయ్ సాయి హత్య కేసులో మరో ట్విస్ట్

SMTV Desk 2017-12-16 16:22:09  vijay sai, suicide case, vanitha, comedian, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 16 : తెలుగు చిత్ర పరిశ్రమ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఈ నెల 11న విజయ్ తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చనిపోయే ముందు ఆయన ఓ సెల్ఫీ వీడియోలో తన మృతికి భార్య వనిత, లాయర్ శ్రీనివాసరెడ్డి, శశిధర్‌ కారణం అంటూ స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు. అయితే గత నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న విజయ్ భార్య, శ్రీనివాస రెడ్డి కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు. తాజాగా విజయ్ మరో యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలును వనితా రెడ్డి మీడియాకు అందించారు. ఇంతకు ముందు వనిత తన భర్తకు మరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయం పై వనితా రెడ్డి మాట్లాడుతూ "విజయ్ చనిపోయాక నేను ఎక్కడికి పారిపోలేదు. నేను విజయ్ నుండి నాలుగు సంవత్సరాలు దూరంగా ఉన్నాను. అతని మరణానికి నేను కారణం అంటూ విజయ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతని అక్రమ సంబంధాలపై ప్రశ్నించేందుకు అతను నాపై దాడి చేశాడు. నా అత్తా మామలు నన్ను పట్టించుకోలేదు. నాకు జరిగిన అన్యాయం కోసం ఎవ్వరు అడగలేదు. నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. పోలీసులకు క్షమాపణలు చెబుతున్న. అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. త్వరలో నేను లొంగిపోతాను. దయ చేసి నాకు మీడియా వాళ్లు సహకారం అందించండి." అని ఒక వీడియో లో పేర్కొన్నారు