జూన్ కల్లా కల్వకుర్తి ప్రాజెక్టు పనులన్నీ పూర్తి: హరీశ్

SMTV Desk 2017-12-13 17:01:31  hareeshrao, irrigation, kalvakurthi, review, jalasoudha

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జలసౌధలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే జూన్ కల్లా కల్వకుర్తి పనులు పూర్తయ్యేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి గాను, నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నెల 26 కల్లా నివేదికను సమర్పించాలని అందులోని అంశాలకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని మంత్రి నీటిపారుదల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కల్వకుర్తి లిఫ్ట్ 3 టన్నెల్ లో మిగిలిన లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. అలాగే మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. కల్వకుర్తితో పాటు రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే పూర్వ పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని మంత్రి తెలిపారు.