తెలంగాణ జీవన సౌందర్యాన్ని జగత్తుకు చాటాలి: కడియం

SMTV Desk 2017-12-08 11:49:50  world telugu conferences, kadiyam srihari, hyderabad, deligates, host

హైదరాబాద్, డిసెంబర్ 08: ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను కనీవినీ ఎరుగని రీతిలో, తెలంగాణ భాష, జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆతిథ్యంలో తెలంగాణకు ఉన్న పేరు ప్రతిష్ఠలను ఇనుమడింపజేయాలని, తెలంగాణ ప్రజలందరూ ఈ పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సభల సందర్భంగా 8వేల మంది అతిథులు వస్తున్నారని, 40 దేశాల నుంచి 160 మంది ప్రతినిధులు నమోదు చేసుకోగా అతిథులందరికీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మహాసభల వేదికల దగ్గర తెలంగాణ వంటకాలు, రచనలు, తెలంగాణ చరిత్రను తెలియచేసే పుస్తకాలు, చిత్రాలు, చేనేతలు, చేతివృత్తులు, కళాప్రదర్శనలు, తెలంగాణ ఆలయాలు, నాణేలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.