నాలుగేళ్ల చిన్నారికి నరకం చూపించిన తల్లి, ఆమె ప్రియుడు

SMTV Desk 2017-12-03 12:44:07  mother torture, 4 years child, sr nagar, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 03 : మానవత్వం మంట కలిసింది... మనుషుల్లో నానాటికి కర్కశత్వం పెరిగిపోతుంది... ఎంత మంది ఎన్ని చెప్పిన కొంత మంది క్రూరులు తమ పద్దతిని విడిచిపెట్టడం లేదు. తాజాగా భాగ్యనగరంలోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీనివాస్‌ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తల్లి తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల చిన్నారి కి ప్రియుడితో కలిసి నరకం చూపించింది. బాగా కాలిన పెనంపై బాలికను కూర్చోబెట్టడంతో శరీరం, కాళ్లుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ గాయాలతో ఉన్న చిన్నారిని, ఒక అనాధ బాలికగా కట్టుకథ అల్లి వదిలించుకునేందుకు ప్లాన్ వేశారు. చివరకు పోలీసుల విచారణలో బాలిక అనాధ కాదని, వారి కూతురేనని తేలడంతో అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...శ్రీకాకుళం జిల్లాకు చెందిన లలితకు వివాహమై రూప అనే నాలుగేళ్ల పాప ఉంది. అదే జిల్లాకు చెందిన ప్రకాశ్‌కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండటంతో కొన్ని నెలల క్రితం పారిపోయి హైదరాబాద్ చేరుకున్నారు. తమ సంబంధానికి బాలిక అడ్డుగా ఉందని వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలిపారు. బాలికను చిత్ర హింసలకు గురిచేశారని చైల్డ్‌లైన్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.