చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు ఓకే: కేటీఆర్

SMTV Desk 2017-11-29 14:26:19  ktr, women reservation, bill, 33 percent, ges

హైదరాబాద్, నవంబర్ 29: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఇంకా పెండింగ్ లోనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా బిల్లుకు మాత్రం మోక్షం దొరకడం లేదు. జీఈఎస్ సదస్సులో మహిళా సాధికారత గురించి అందరూ మాట్లాడుతున్న వేళ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యతపై జీఈఎస్ వేదిక వద్ద మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, మహిళలకు 33 శాతం బిల్లును పార్లమెంట్‌లో పెడితే తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే శాసనసభలో తీర్మానం చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. మహిళా శాసనసభ్యుల సంఖ్య కూడా తక్కువగా ఉందన్నారు. కాగా మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వకుండా మహిళా సాధికారత గురించి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విపక్షాలు విమర్శించాయి.