ఈ ముగ్గురు ఆదర్శ మహిళలు: ఇవాంక

SMTV Desk 2017-11-29 12:57:11  ivanka, three womens, ideal, ges

హైదరాబాద్‌, నవంబర్ 29: జీఈఎస్‌ సదస్సు లో మహిళా సాధికారత గురించి చర్చిస్తున్న వేళ తమ వినూత్న ఆవిష్కరణలతో సమాజ సేవ చేసిన ముగ్గురు మహిళలు ఇవాంక మదిని దోచారు. ఇవాంక మనసు గెలిచిన ఆ మహిళల గురించి.. దారా డాట్జ్ : అమెరికాకు చెందిన దారా డాట్జ్.. విపత్తులవేళ అత్యవసర సహాయం చేసేందుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫీల్డ్‌ రెడీ సంస్థను స్థాపించారు. ఎక్కడ విపత్తు జరిగినా వెంటనే సాయం అందించడంలో ఈ సంస్థ ముందుంటుంది. హైతీలో విలయం, నేపాల్‌లో వరదలు, హరికేన్‌లు ముంచుకొచ్చిన సమయాల్లో విశిష్ట సేవలందించింది. ఆమె రూపొందించిన గురుత్వాకర్షణశక్తి రహిత త్రీడీ ప్రింటర్‌ను అంతరిక్ష పరిశోధనల్లోనూ వినియోగించారు. రాజలక్ష్మి బార్‌థాకూర్‌: అస్సామీ పారిశ్రామికవేత్త అయిన రాజలక్ష్మి స్థాపించిన టెర్రాబ్లూ ఎక్స్‌టీ టెలీమెడిసిన్‌ సహాయంతో టెలీ కాన్ఫరెన్సు ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో రోగులకు వైద్యసేవలు అందుతున్నాయి. తన కుమారుడికి చిన్నప్పుడే జబ్బు చేసినప్పుడు సొంత విజ్ఞానంతో స్మార్ట్‌గ్లోవ్‌ను తయారు చేశారు. ఈ గ్లోవ్‌ సహాయంతో వివిధ రుగ్మతలను సులువుగా గుర్తించవచ్చు. రేయాన్‌ కామలోవా: వర్షపునీటిని ఇంధనంగా మార్చాలనే ఆలోచనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల రేయాన్‌ కామలోవా గురించి కూడా ఇవాంక గొప్పగా చెప్పారు. అజర్‌బైజాన్‌లో 2002లో జన్మించిన రేయాన్‌, ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. వర్షపునీటి నుంచి ఇంధనం తయారుచేయాలనే ఆలోచనతో స్నేహితులు, భౌతికశాస్త్ర నిపుణులతో కలిసి రెయిన్‌ ఎనర్జీ పరికరాన్ని సిద్ధం చేసింది. వర్షపునీరు వాటర్‌ ట్యాంక్‌లో పడి అక్కడి నుంచి విద్యుదుత్పత్తి జనరేటర్‌కు వేగంగా వెళ్లి, అక్కడ విద్యుత్తు ఉత్పత్తి జరిగి.. బ్యాటరీలో నిక్షిప్తమవుతుంది. ఇదే ఆలోచనతో ఒక కంపెనీ కూడా స్థాపించారు.