పాల్వాయి గోవర్దన్‌రెడ్డి సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

SMTV Desk 2017-11-21 12:36:43  Telangana State Chief Minister KCR, PCC president Uttamkumar Reddy, congress

చండూరు, నవంబరు 20: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతుల మీద అంత ప్రేముంటే మూడేళ్లుగా రైతాంగానికి ఎకరాకు రూ.4 వేలు ఎందుకివ్వలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా చండూరులో సోమవారం నిర్వహించిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మోసపూరిత వాగ్దానాల బాటతోనే ఈ స్థాయికి చేరుకున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రుణమాఫీ ఏకకాలంలో వర్తింపజేయకపోవడంతో రైతులపై అపరాధ వడ్డీ పడిందని, దీంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగాలిస్తానన్న సీఎం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు రూ.20వేల కోట్లు ఇచ్చేందుకు డబ్బులుంటాయి కానీ, విద్యార్థులకు రూ.1600 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించలేరా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 2019లో గెలిచేది కాంగ్రెసేనని, రైతాంగానికి ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఉద్యోగాలు పొందని యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో, మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే పాల్వాయికి నిజమైన నివాళి అర్పించినట్లు అని ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు.