సైబర్ నేరగాళ్లు ఉన్నారు జాగ్రత్త

SMTV Desk 2017-06-12 17:50:54  Uttarpradesh,Delhi,Noida,Hyderabad

హైదరాబాద్, జూన్ 12 : "సార్, మేము ఉత్తరప్రదేశ్ లోని భరత్ పూర్ జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యాసంస్థలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఢిల్లీ, నోయిడా కంటే హైదరాబాద్ లో నాణ్యమైన సీసీ కెమెరాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉందని వెబ్ సైట్ ద్వారా తెలుసుకున్నాం. డీలర్ల సమాచారం తెలుసుకున్నాం. అందులో మీ కంపెనీ నాణ్యమైన సేవలందిస్తుందని గుర్తించాం. మాకు 850 సీసీ కెమెరాలు కావాలి మీరు అల్వార్ జిల్లాకు వచ్చి విద్యాసంస్థలను చూసి ఎక్కడ ఎలాంటివి అమర్చాలో చెప్పండి. అక్కడే సగం అడ్వాన్సు ఇస్తాం.. మిగిలింది వాటిని అమర్చిన వెంటనే ఇస్తాం. సీసీ కెమెరాలను సరఫరా చేస్తున్న నగరంలోని ఓ కంపెనీ ప్రతినిధులకు ఫిబ్రవరి నెలలో అల్వార్ జిల్లా నుంచి వచ్చిన ఫోన్ ఇది. ఆ సమాచారం ఆధారంగా వెళ్ళిన ఇద్దరు కంపెనీ ప్రతినిధులను ఓ ముఠా సభ్యులు అల్వార్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళారు. తలకు తుపాకీ గురి పెట్టారు. హైదరాబాద్ లో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి రూ.20 లక్షలు ఇచ్చాక వదిలిపెట్టారు. ఇక్కడికి క్షేమంగా చేరుకున్న తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు సంపాదించడానికి ఉత్తరాది ముఠాలు ఎంచుకున్న కొత్త నేరాల్లో ఇదొకటి. ఈ తరహాలోనే బంగారు ఆభరణాలు, ఇటుకలు, ల్యాప్ టాప్ లు, పాత రాగి, ఇనుము తుక్కు తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మించి అక్కడికి పిలిపించుకుని కిడ్నాప్ చేస్తున్నారు. తట్లూబాజీ ముఠాతో పాటు ఢిల్లీ, హర్యానా ముఠాలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం ఫేస్ బుక్, వాట్సప్ వెబ్ సైట్లను నిత్యం అనుసరిస్తున్నారని వివరిస్తున్నారు. బంగారు నాణేలు ఇస్తాం.. రండి తక్కువ ధరకే బంగారు నాణేలిస్తాం.. రండి అంటూ సామాజిక మాధ్యమాలలో హర్యానా ముఠా ఇటీవల ప్రకటనలు గుప్పిస్తోంది. సరూర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. తమ పూర్వీకులు ఇళ్ళలో బంగారు నాణేలు దాచిపెట్టారని, ఇటీవల పాత ఇళ్ళను కూలగొట్టి కొత్తగా నిర్మించుకుందామని పునాదులు తీయగా, అవి బయట పడ్డాయని వారు తెలిపారు. ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే ఆదాయం రాదనీ గ్రహించి సామాజిక మాధ్యమాలలో ప్రకటనలిచ్చామంటూ ప్రపుల్ చౌదరి అనే వ్యక్తి సరూర్ నగర్ వాసితో మాట్లాడాడు. ఒక్కో బంగారునాణెం బరువు 100 గ్రాములు ఉంటుందని, దీనిని లక్ష రూపాయలకే ఇస్తామని చెప్పాడు. ఈ-మెయిల్ ద్వారా నాణెం చిత్రాన్ని పంపించాడు. ఆ మాటలు నమ్మిన సరూర్ నగర్ వ్యక్తి 10 నాణేలను రూ. 8 లక్షలకు ఇస్తారా? అని బేరమాడాడు. సరేనని దొంగ అంగీకరించడంతో రెండు నెలల క్రితం అక్కడికి వెళ్ళాడు. భరత్ పూర్ గ్రామానికి వెళ్ళాక హర్యానా ముఠా సభ్యులు ఆయను ఆహ్వానించారు. ఒక హోటల్ లో అతిధి మర్యాదలు చేశాక తమ ఊరికి వెళ్దామంటూ తీసుకెళ్ళారు. మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి తుపాకీ గురిపెట్టి రూ. 8 లక్షలు, ఫోన్ లాక్కుని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు.స్థానికుల సహకారంతో బాధితుడు హైదరాబాద్ కు చేరుకున్నాడు. రూ. 7 వేలకే ల్యాప్ టాప్ అంటూ.. ఢిల్లీ లో ఉంటున్న మరో ముఠా వ్యవహారమిది. ప్రముఖ కంపెనీలకు చెందిన ల్యాప్ టాప్ లను తక్కువ ధరకే ఇస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. ఇక్కడికి వచ్చి నాణ్యత పరిశీలించుకుని డబ్బులిచ్చాక తీసుకుని వేల్లోచంటు ప్రకటనల్లో పేర్కొన్నారు. అమీర్ పేటలో కంప్యూటర్ కేంద్రం నిర్వహిస్తున్న భాస్కర్ కొద్దిరోజుల క్రితం దొంగల ముఠా సభ్యులను సంప్రదించగా ఢిల్లీకి ఏ రోజు రావాలో తెలిపారు. రూ. లక్ష పట్టుకుని భాస్కర్ వెళ్ళాడు. రైల్వే స్టేషన్ నుంచి ఇద్దరు ముఠా సభ్యులు తమ అతిధి గృహంలోకి తీసుకెళ్ళారు. ఓ ల్యాప్ టాప్ ఇచ్చి పరీక్షా చేసుకోమన్నారు. భాస్కర్ సంతృప్తి వ్యక్తం చేయడంతో నోయిడాకు సమీపంలో గోదాములున్నాయంటూ కారులో తీసుకెళ్ళారు. ఢిల్లీ సరిహద్దు దాటిన తర్వాత ఎక్స్ ప్రెస్ వే పక్కకు తీసుకెళ్ళి తుపాకీ గురిపెట్టి చంపివేస్తామంటూ బెదిరించారు. భాస్కర్ వద్ద ఉన్న లక్ష రూపాయలను తీసుకుని, మరో రూ. 9 లక్షలను తమ ఖాతాల్లో వేయాలంటూ హెచ్చరించారు. దీంతో భాస్కర్ తన కుటుంబ సభ్యులు , స్నేహితులకు ఫోన్ చేసి వారడిగిన మొత్తాన్ని బదిలీ చేయించారు. నగదు జమ కాగానే భాస్కర్ ను వదిలేసి పారిపోయారు.