త్రాచుకి భయపడి ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన వ్యాపారి.!

SMTV Desk 2018-12-06 11:30:07  

పుదుచ్చేరి : మాములుగా ఇంట్లోకి పాము వస్తే వెంటనే అటవీశాఖ అధికారులకో, లేదా స్నేక్ సొసైటీ సభ్యులకో ఫోన్ చేస్తాం. తాజాగా ఓ వ్యాపారి ఏకంగా ముఖ్యమంత్రికే ఫోన్ చేసాడు. అటవీశాఖకు ఫోన్ చేస్తే అధికారులెవరూ స్పందించకపోవడంతో సీఎంకే ఫోన్ కొట్టాడు. అర్ధరాత్రి ఫోన్ రావడంతో ఎత్తిన ముఖ్యమంత్రి, సమస్యను విని విసుక్కోకుండా సానుకూలంగా స్పందించారు. అనంతరం అడ్రెస్ తెలుసుకొని సదరు వ్యాపారి ఇంటికి వెళ్లి సాయం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

పుదుచ్చేరి రాష్ట్రం అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారికి భార్య, వొక కుమారుడు,వొక కుమార్తె ఉన్నారు. అయితే మంగళవారం రాత్రి వీరు నిద్రపోతుండగా ఇంట్లోకి ఓ తాచుపాము వచ్చింది. వీరిని చూసి బుసలు కొట్టడం మొదలుపెట్టగా ఆ శబ్దానికి మేల్కొన్న రాజా, వెంటనే కుటుంబ సభ్యులను లేపాడు. అనంతరం పామును పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసాడు. అయితే ఎవరూ స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి అని విజ్ఞప్తి చేశాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి ఆయన అడ్రస్ తెలుసుకొని భయపడకుండా ఉండండి నేను వెంటనే అధికారులను పంపుతానని దైర్యం చెప్పారు.

అనంతరం ఇద్దరు అటవీశాఖ అధికారులను సంబంధిత వ్యాపారి అడ్రస్ కు వెళ్లాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు పామును పట్టుకోవడంతో వ్యాపారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నారాయణస్వామి స్పందించిన తీరుపై పుదుచ్చేరి ప్రజలు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.