పంపిణీకి సిద్దమైన గొర్రెలు

SMTV Desk 2017-06-11 13:38:52  Distribution of sheep, State livestock department, Karnataka, Andhra Pradesh, Maharashtra and Tamil Nadu

హైదరాబాద్, జూన్ 11 : తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ నెల 20 నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభించడానికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే. గొర్రెల కొనుగోలు, రవాణాలో జాగ్రత్తలు, ఇతర అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి గొర్రె, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ లక్ష్మణ్ రెడ్డి ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో సందేహాల నివృత్తికి రెండు రోజుల క్రితం కలెక్టర్ లతో సదస్సును నిర్వహించారు. దీంతో పాటు అదనపు వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్ 7337362131లో కానీ 1800-599-3699 టోల్‌ఫ్రీ నంబర్‌లో ఎండీ, తెలంగాణ గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సమాఖ్య కార్యాలయంలో సంప్రదించవచ్చని వెల్లడించారు. ఇప్పటికే గొర్రెల ప్రాథమిక సహకార సంఘాల ఏర్పాటు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలు విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు గొర్రెల కొనుగోలు పనులు ముమ్మరం చేశారు. ఈ మేరకు ఒక యూనిట్ కోసం 12 - 18 నెలల వయస్సున్న 20 గొర్రెలను, ఒక పొట్టేలును కొనుగోలు చేయాలి. లిస్ట్-ఏలో ఎంపికైన లబ్ధిదారుల దరఖాస్తులను ఈ-లాబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. లబ్ధిదారుడు తన వాటా డబ్బు చెల్లించి రసీదు డీడీకి జత చేసి, డీడీ వెనుక భాగంలో లబ్ధిదారుడి పేరు, సంఘం పేరు, లాటరీ సీరియల్ నంబర్ తప్పక రాయాలి. ఒక జిల్లాలోని లబ్ధిదారులందరి నుంచి ఒకేసారి 25 శాతం సబ్సిడీ మొత్తాన్ని వసూలు చేయవద్దు. కర్ణాటక,అంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోలుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలి. ఈ నెల 18,19 వరకు గొర్రెల యూనిట్లను క్షేమంగా లభ్ధిదారుడి ఇంటికి చేర్చే బాధ్యత పై రవాణాకు పైకప్పు సరిగా ఉన్న డబుల డెక్కర్ వాహనంలో గొర్రెలకు వర్షం, ఎండ నుంచి రక్షణతో ఒక్కో వాహనంలో 128 గొర్రెల రవాణా చేయాలని వెల్లడించారు. రవాణాకు పట్టే సమయాన్ని బట్టి గొర్రెలకు మేత, నీళ్ళ సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు.