ప్రగతిభవన్ లో పంచాయతీ నిధులపై కేసీఆర్ సమీక్ష..

SMTV Desk 2017-11-04 11:28:44  pragathi bavan, cm kcr, Panchayati Raj, hyderabad

హైదరాబాద్, నవంబర్ 04 : కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పనపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతిభవన్‌లో కీలక సమావేశం నిర్వహించి విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే పంచాయతీరాజ్‌ కొత్త చట్టం తీసుకురావడం ప్రభుత్వ ఉద్దేశమంటూ ఆయన అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు అత్యంత క్రియాశీలకంగా పని చేసేలా చూడటంతో పాటు విధి నిర్వహణలో విఫలమైన వారిపై చర్యలు తీసుకోవడానికి వీలుగా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించలన్నారు. గ్రామ పంచాయతీలకు నేరుగా బడ్జెట్‌ ద్వారా నిధులను కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. రానున్న బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికగా ఒక్కో గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలు సమకూర్చనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగురామన్న, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, ప్రణాళికా బోర్డు ఛైర్మన్‌ నిరంజన్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగరావు, రామకృష్ణారావు, సునీల్‌శర్మ, వికాస్‌రాజ్‌, కార్యదర్శి స్మితా సబర్వాల్‌, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నీతూప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టం ఎలా ఉండాలి, ఎలాంటి విధులు స్థానిక సంస్థలకు అప్పగించాలి? అవి ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి, నిధులెలా సమకూర్చాలి, ప్రజలకు మరింత జవాబుదారీగా క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు.