జల సౌధ సదస్సులో మంత్రి హరీశ్ రావు.....

SMTV Desk 2017-10-08 18:40:39  Mission Kakatiya Third Phase, Heavy Irrigation Minister Harish

హైదరాబాద్, అక్టోబర్ 8 : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడనున్న ఎత్తిపోతల పథకాలకు సర్కార్ సన్నాహాలు చేస్తుంది. శనివారం జరిగిన మిషన్ కాకతీయ మూడో దశ జల సౌధ సమావేశంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ....వచ్చే సంవత్సరం నాటికి అదనంగా లక్ష ఎకరాలకు నీటిని అందించాలని ఐడీసీ(ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్) అధికారులను సూచించారు. దానికి అనుగుణంగా పెండింగులో ఉన్న ఎత్తి పోతల పథకాలను వచ్చే వేసవి నాటికి పూర్తిచేయాలని, లక్ష్యానికి వ్యతిరేకంగా ఉదాసీనత ప్రదర్శిస్తే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నీటి లభ్యత ఉన్నచోట కొత్త పథకాలు పెడతామని, ఈ నెలలో 28 పథకాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, వీటి ద్వారా 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 125 పథకాలకు మర మత్తు చేపట్టగా, దానికి రూ.460 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మిషన్ కాకతీయ నాలుగో దశ కింద కొత్తగా చేపట్టనున్న పనులను గుర్తించి, లోపాలు లేకుండా సవరణలకు అవకాశం లేని జాబితాను తయారుచేసి నెలాఖరు లోపల పంపామని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్, ఐడీసీ ఎండీ సురేశ్‌ కుమార్ తదితరులు పాల్గొన్నారు.