మాజీ ప్రధాని పై రూపుదిద్దుకుంటున్న చిత్రం

SMTV Desk 2017-06-06 19:08:04  Manmohan singh, Bollywood actor Anupam kher,PM media advisor sanjaybaru

న్యూఢిల్లీ, జూన్ 6 : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటించనున్నారు. మాజీ ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్’ పుస్తకం ఆధారంగా రానున్న ఈ సినిమాను 2019 సార్వత్రిక ఎన్నికల్లోపే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ బుధవారం విడుదల కానుంది. నిర్మాత సునీల్ బోహ్రా మాట్లాడుతూ.. రిచర్డ్ అటన్‌బరో తీసిన గాంధీ సినిమాకు మించి ఈ సినిమా ఉంటుందని, పూర్తి పొలిటికల్ డ్రామా సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమాపై పరిశోధన పూర్తయిందని, మిగతా నటుల కోసం వెతుకుతున్నట్టు తెలిపారు. మన్మోహన్ సింగ్ పాత్ర పోషించనున్న అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం నిజంగా సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నారు. సమకాలీన రాజకీయ చరిత్రలోని ఓ నాయకుడి పాత్ర పోషించడం అంత ఆషామాషీ విషయం కాదన్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న షాహిద్ సినిమా దర్శకుడు హన్సాల్ మెహతా.. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించనున్నారు.