సింగరేణిలో వికసించిన గులాబీ....

SMTV Desk 2017-10-06 12:24:39  TRS Affiliate TBGKS Posts Big Win in Singareni Polls

హైదరాబాద్, అక్టోబర్ 06 : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘం (టీబీజీకేఎస్) విజయాన్ని కైవసం చేసుకుంది. విపక్షాలు ఏకమైన ఒంటరిగానే పోటీ చేసి మోజార్జీ ఏరియాలో తిరుగులేని శక్తిగా అవతరించింది. మొత్తం 11 డివిజన్లలోని 9 ఏరియాలో సత్తా చాటింది. కాంగ్రెస్, తెదేపా, సీపీఎం మద్దతుతో బరిలో నిలిచినా ఏఐటీయూసీ కేవలం రెండు ఏరియాలోనే గెలుపొంది ఉనికి చాటుకునే ప్రయత్నం చేసింది. ఆరు జిల్లాల పరిధిలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకంగా భావించే సింగరేణి గనుల్లో గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 52,534 ఓట్లకు గాను 49,902 ఓట్లు పోల్ అవగా 23, 869 తో టీబీజీకేఎస్ రెండోసారి గుర్తింపు కార్మిక సంఘంగా గెలుపు కైవసం చేసుకుంది. విపక్ష ఏఐటీయూసీ కూటమి 19,327 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా హెచ్ఎంస్ కు 3916 , ఇతరులకు 2790 ఓట్లు దక్కాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తెరాస, టీబీజీకేఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నాయి.