ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ఇలా...

SMTV Desk 2017-10-06 11:29:24  love marriage, vemulavada, balrajupalli village, CI Srinivas, madhavi.

వేములవాడ, అక్టోబర్ 6 : ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. సొంత బంధువులే అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసిన ఘటన వేములవాడ మండలంలోని బాల్రాజుపల్లిలో కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాల్రాజుపల్లికి చెందిన నేదూరి హరీశ్‌(22) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గతంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన నేదూరి రచన(21) తన మేనమామ ఇంటి వద్ద ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది. వీరిద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండడంతో గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల పాటు బంధువుల ఇంట్లో తలదాచుకొని తిరిగి సొంత గ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లిని జీర్ణించుకోలేని రచన బంధువులు అతి కిరాతకంగా వీరిద్దరి గొంతుకోసి అక్కడి నుండి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆ ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ శ్రీనివాస్‌, మాధవి లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.