ఎంపీ చొరవతో స్వగ్రామనికి చేరిన యువకుడు

SMTV Desk 2017-06-06 17:26:51  prison jail, trapped, nijambad dist teenager

హైదరాబాద్, జూన్ 6 : ఖతార్ జైలులో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లా యువకుడు ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో క్షేమంగా స్వగ్రామానికి చేరాడు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్ మండలం గన్నారం గ్రామానికి చెందిన ఎర్ర సాగర్ ఈ ఏడాది జనవరిలో ఖతార్ వెళ్లి అల్ మహ అనే వ్యక్తి వద్ద ప్రైవేటు డ్రైవర్ గా నెలకు 1500 దరమ్స్ తో చేరాడు. నెల పుర్తయిన తర్వాత వేతనం అడిగితే యజమాని దాడిచేసి పోలీసులకు అప్పగించారు. దీంతో మరొక వ్యక్తి దగ్గర పనిలో చేరాడు. అక్కడ కూడా మూడు నెలల తర్వాత యజమాని జీతం ఇవ్వకపోవడంతో అడిగితే సాగర్ ను తీవ్రంగా కొట్టి, పాస్ పోర్ట్ లాక్కొని గెంటి వేశాడు. పైగా దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసి జైలు లో పెట్టించిన యజమాని, సాగర్ తన పరిస్టితిని ఎంపీ కల్వకుంట్ల కవితకు వాట్సప్ లో వివరించి, కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో ఎంపీ అక్కడి భారత ఎంబసీ అధికారులతో ఫోన్ లో మాట్లాడి సాగర్ ను స్వగ్రామానికి రప్పించేందుకు కృషి చేశారు. పాస్ పోర్ట్ లేకపోవడంతో ఎంబసీ అధికారులు ఔట్ పాస్ ఇచ్చి, మూడు రోజుల క్రితం భారత్ కు పంపారు. ఇందుకు సహకరించిన ఎంబసీ అధికారి ఫణిశ్రీకి నవీన్ ఆచారి కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో జాగృతి జిల్లా కన్వీనర్ అవంతిరావు, మహిళా విభాగం కన్వీనర్ అపర్ణ, విద్యార్ది విభాగం జిల్లా కన్వీనర్ పులి జైపాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎంపీ కవితకు రుణపడి ఉంటాం అంటూ....తనను స్వదేశానికి రప్పించడానికి కృషి చేసిన ఎంపీ కవితకు తాను,తన కుటుంబ సభ్యులు రుణపడి ఉంటామని ఎర్ర సాగర్ అన్నాడు. ఎంపీ తక్షణమే స్పందించకపోయి ఉంటే ఖతార్ జైలు లోనే ఉండేవాడినని వాపోయాడు.